వై ఎస్ బయోపిక్ లో వై ఎస్ గా ముమ్మట్టి, సబితగా సుహాసిని?!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, జననేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథను తెరపై ఆవిష్కరిస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ పాత్రలో ప్రముఖ మలయాళ హీరో మమ్ముట్టి కనిపించనున్నారు. ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ పాత్రలో ‘బాహుబలి’ ఫేం అశ్రితా వేముగంటి నటించనున్నారు. ఇక వైఎస్ వ్యక్తిగత సహాయకుడు సూరీడు పాత్రకు పోసాని కృష్ణమురళీని ఎంపిక చేశారు. అయితే ఇప్పుడు ఈ బయోపిక్లోకి సీనియర్ నటి, దర్శకుడు మణిరత్నం భార్య సుహాసిని ప్రవేశించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాత్రను ఆమె పోషించనున్నారు. ‘ఆనందో బ్రహ్మ’ చిత్రానికి దర్శకత్వం వహించిన మహి వి రాఘవ్.. వైఎస్ఆర్ బయోపిక్ను తెరకెక్కించనున్నారు. 70 ఎంఎ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాలో తన పాత్రకు మమ్ముట్టి స్వయంగా డబ్బింగ్ చెప్పుకోనున్నట్లు టాక్ వచ్చింది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సుమారు రూ.30 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారని, రాజశేఖర్రెడ్డి పాదయాత్రను ప్రధానంగా చూపిస్తారట. అందుకే ‘యాత్ర’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ప్రస్తుతం నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ సినిమాకు సంబంధించి వివరాలేవీ వెల్లడించడంలేదు. వైఎస్ రాజకీయ జీవితంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు పాత్ర కూడా ఎక్కువే. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన తొమ్మిదేళ్లు ప్రతిపక్షనేతగా అసెంబ్లీలో కూర్చున్నారు. మరి అంత ప్రాధాన్యం ఉన్న పాత్రకు ఎవరిని ఎంపిక చేస్తారనే ఆసక్తి కూడా ప్రేక్షకుల్లో ఉంది. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ మే నెలలోనే ప్రారంభంకావాలి. నటీనటుల ఎంపిక పూర్తికాకపోవడంతో ఆలస్యమవుతోంది. ఎప్పుడు మొదలవుతుందనే విషయంపై స్పష్టత లేదు. మొత్తానికి సంక్రాంతి కానుకగా జనవరిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. ఇదిలా ఉంటే, వైఎస్ జగన్ చెల్లెలు షర్మిల పాత్రలో భూమిక నటించననున్నట్లు గతంలో పుకార్లు వచ్చాయి. అయితే వీటిని భూమిక, దర్శకుడు రాఘవ్ ఖండించారు.

Related Articles

Leave A Reply

Your email address will not be published.