Mahanati

సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన లెజెండరీ యాక్టర్ సావిత్రి బయోపిక్ మూవీ ‘మహానటి’ భారీ అంచనాల నడుమ బుధవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ సువర్ణాధ్యాయాన్ని లిఖించుకున్న నటి సావిత్రి. ఆ జీవితం మొత్తం తెరచిన పుస్తకమే. 75 శాతం నటిగానే సాగింది ఆమె జీవితం. ఆ మిగిలిన 25 శాతం జీవిత పరిణామాలపై రకరకాల ఊహాగానాలు ఉన్న నేపథ్యంలో ప్రేక్షకుల్లో ఆసక్తిరేపుతూ మే 9న (నేడు) ప్రేక్షకుల ముందుకు వచ్చిన సావిత్రి బయోపిక్ మూవీ ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకూ రీచ్ అయ్యిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథ:
మధురవాణి(సమంత) బిఏ గోల్డ్ మెడలిస్ట్. ప్రజావాణి అనే పత్రికాఆఫీస్లో జర్నలిస్ట్గా పనిచేస్తుంటుంది. అయితే ఆమె ప్రతిభను నిరూపించుకునే అవకాశం మాత్రం దొరకదు. అదే సమయంలో నటి సావిత్రి గారు అనారోగ్యంతో హాస్పిటల్లో చేరతారు. ఆమె కోమా స్టేజ్లోకి వెళ్లిపోవడంతో ఆమెకు సంబంధించిన వార్తను కవర్ చేయమని ఎడిటర్ మధురవాణికి బాధ్యతలు అప్పగిస్తారు. ఈ క్రమంలో మధురవాణి.. సావిత్రి గారి జీవితంలో కొన్ని విషయాలను తెలుసుకుంటుంది. వాటి సహాయంతో సావిత్రి జీవితాన్ని ఓ కథగా
రాయలనుకుంటుంది. మధురవాణికి సావిత్రి గారి గురించి ఏం తెలిసింది..? చివరకు తను అనుకున్న కథను రాయగలిగిందా..? అనేదే మిగిలిన సినిమా.
విశ్లేషణ:
సావిత్రి జీవిత చరిత్రతో ఓ యంగ్ డైరెక్టర్ సినిమా చేస్తున్నాడని తెలిసినప్పుడు అందరూ పెదవి విరిచారు. ఆమె గురించి ఏం తెలుసని, అతడికి ఏం అర్హత ఉందంటూ కొన్ని కామెంట్లు చేశారు. కానీ ఈ సినిమా వారందరికీ ఓ సమాధానంగా నిలుస్తుంది. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయాలనే తెరపై ఎంతో ఆసక్తికరంగా ఆవిష్కరించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. సావిత్రి గారు సినిమాల్లోకి ఎలా వచ్చారు..? అసలు ఆమె సినిమాల్లోకి రావడానికి ప్రేరేపించిన అంశాలు ఏంటి..? సినిమాల్లోకి వచ్చిన తరువాత ఆమె ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది..? బంగారం లాంటి తన జీవితాన్ని మద్యానికి ఎందుకు బానిస చేయాల్సి వచ్చింది..? ఇలా ఆమె జీవితంలో చోటు చేసుకున్న మంచి, చెడు రెండు తెరపై చూపించారు. కానీ ప్రతీదీ నిజాయితీగా చూపించిన దర్శకుడు నాగ్ అశ్విన్ను భుజం తట్టి మెచ్చుకోవాల్సిందే.
సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకుడి ముఖంలో ఒకరకమైన సంతృప్తి కలుగుతుంటుంది. ఎందరికో సహాయం చేసిన చివరి రోజుల్లో పడే బాధను చూసి ప్రేక్షకుడు చలించిపోతాడు. ప్రేమించిన వ్యక్తిని తన ప్రేమ కోసమే దూరం చేసుకునే విషయంలో ఆమె వ్యక్తిత్వం ఎంత బలమైనదో అర్ధమవుతుంది. ‘ఇది నీ వల్ల కాదు’ అని ఎవరైనా ఆమెను కామెంట్ చేస్తే మొండి పట్టుదలతో తన వల్ల కాదన్న విషయాన్ని చేసి చూపిస్తుంది. ఇదీ సావిత్రి నైజం. బహుశా ఇకపై ఆమెలాంటి మహానటిని చూడలేమేమో అనిపిస్తుంటుంది. అంత గొప్ప నటి పాత్రలో కీర్తి సురేష్ అద్భుత నటనను ప్రదర్శించారు. కొన్ని చోట్ల సావిత్రి గారిని నిజంగానే మళ్ళీ తెరపై చూస్తున్నామా..? అనేంతగా ఆ పాత్రలో ఇమిడిపోయింది. కాస్ట్యూమ్స్, మేకప్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. సినిమాలో మాయాబజార్ ఎపిసోడ్, అలానే సావిత్రి గారి పరిచయ సన్నివేశాలు హైలైట్గా నిలిచాయి. కీర్తి తప్ప ఈ పాత్రకు మరెవరూ న్యాయం చేయలేరేమో.. అంతగా ప్రేక్షకులపై ఇంపాక్ట్ చూపించింది. బాధ, సంతోషం, కోపం, పట్టుదల ఇలా ప్రతి ఒక్క ఎమోషన్ను కళ్ళతోనే పలికించింది.
మహానటికి తన నటనతో పూర్తి న్యాయం చేసింది. జెమినీ గణేషన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ ఇమిడిపోయాడు. కీర్తి, దుల్కర్ ల కాంబినేషన్ సన్నివేశాలు బాగా పండాయి. సావిత్రి గారు తన భార్య అంటూ జెమినీ గణేషన్ అందరి ముందు చెప్పే సన్నివేశం వారి మధ్య ఎంత ప్రేమ ఉందో.. తెలిసేలా చేస్తుంది. ఇక ఏఎన్నార్ పాత్రలో నాగ చైతన్య జీవించారు. రెండు మూడు సీన్లలో ఏఎన్నార్ను గుర్తుచేశారు. మరో కీలకమైన రోల్ ఎన్టీఆర్ పాత్రలో ఆ మహానటుడ్నే చూపించారు. కొత్తగా ఆ పాత్రకోసం ఎవర్నీతీసుకునే ప్రయత్నం చేయలేదు. మధురవాణిగా సమంత, విజయ్ ఆంటోనీగా విజయ్ దేవరకొండ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఎస్.వి.రంగారావు పాత్రలో మోహన్ బాబు నటన మరో అద్భుతం. సావిత్రి గారి పెదనాన్నగా రాజేంద్రప్రసాద్ పాత్ర తెరపై బాగా పండింది. కీర్తి, రాజేంద్రప్రసాద్ల ట్రాక్ సినిమాకు మరో ప్లస్.
షాలిని పాండే, క్రిష్, అవసరాల శ్రీనివాస్, ప్రకాష్ రాజ్ ఇలా ప్రతి ఒక్క నటులు తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సాంకేతికంగా సినిమాను మంచి క్వాలిటీతో తెరకెక్కించారు. కెమెరా వర్క్ సినిమాకు హైలైట్గా నిలిచింది. కొన్ని సన్నివేశాల కోసం పాతకాలపు ఫిల్మ్ను ఉపయోగించారు. బ్లాక్ అండ్ వైట్ సన్నివేశాలను చూడడం కొత్తగా అనిపిస్తుంది. ఆర్ట్ వర్క్ అద్భుతంగా ఉంది. మిక్కీ జె మేయర్ అందించిన పాటలు సినిమా స్థాయిని పెంచాయి.టైటిల్ సాంగ్, చివరకు మిగిలేది వంటి పాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. ఎడిటింగ్ వర్క్ బాగుంది. ప్రేక్షకుడు సినిమాలో ఇన్వాల్వ్ అవ్వడంతో నిడివి గురించి పెద్దగా పట్టించుకోరు. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాను అద్భుతంగా చిత్రీకరించి ప్రేక్షకులకు మహానటి ఎంత గొప్పదో చాటిచెప్పిన దర్శకుడు నాగ్ అశ్విన్ను పొగడకుండా ఉండలేము. ఓవరాల్గా మహానటి ఓ అద్భుత దృశ్య కావ్యం. తరాలను నిర్మించే స్త్రీ జాతి కోసం తరతరాలు గర్వించే సావిత్రి కథే ‘మహానటి’ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Related Articles

Leave A Reply

Your email address will not be published.