Kaala

సూపర్ స్టార్ రజినీకాంత్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడమంటే అది చాలా గొప్ప విషయం. అలాంటిది దర్శకుడు పా రంజిత్ కు వరుసగా ఆయనతో రెండో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. ‘కబాలి’ సినిమాకు కొన్ని చోట్ల నెగెటివ్ టాక్ వచ్చినా, ఈ సినిమా ఎవరికీ నష్టాలను మిగల్చలేదు. ఇక రంజిత్ పై నమ్మకంతో రజినీకాంత్ మరో సినిమా చేశాడు. అదే ‘కాలా’. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందో లేదో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!
కథ:
ప్రస్తుత రాజకీయాల పైన బిజినెస్ పెత్తందారులు పైన ఉద్రేకపూరిత సన్నివేశాలతో ముంబైలో ధారావి తమిళ ప్రజలు కోసం కరికాలన్ (రజినీ) చేసిన పోరాటమే కాలా. ముంబైలో ధారవి అనే ప్రాంతాన్ని కన్నబిడ్డలా చూసుకుంటాడు కాలా(రజినీకాంత్). అక్కడ ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా చలించిపోతాడు. ధారావి ప్రజలు సైతం కాలాను ఓ దేవుడిలా చూస్తుంటారు. కాలా తన కుటుంబంతో కలిసి ధారావిలోనే సంతోషంగా జీవిస్తుంటాడు. అయితే ఆ ప్రాంతాన్ని దక్కించుకోవాలని రాజకీయనాయకుడు హరిదాదా(నానా పటేకర్) ప్రయత్నిస్తుంటాడు. ఆ ప్రాంతంలో ఓ స్మార్ట్ సిటీ నిర్మించాలనేది అతడి కల. కానీ ధారావిలో కాలా ఉన్నంతవరకు అది జరగదని తెలుసుకుంటాడు. దీంతో కాలాతో మాట్లాడడానికి అతడి ఇంటికి వెళ్తాడు. కానీ అక్కడ అతడికి అవమానం జరగడంతో కాలాపై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. తన రాజకీయ పలుకుబడితో ధారవి ప్రజలకు కనీసపు అవసరాలు అందకుండా చేస్తూ కాలాను చంపే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో కాలా భార్య స్వర్ణ (ఈశ్వరీరావు), కాలా పెద్దకొడుకు శివన్న చనిపోతారు. ఆ తరువాత కాలా ఎలా రియాక్ట్ అయ్యాడు..? అయినవారిని పోగొట్టుకున్న కాలా.. హరిదాదాను ఏం చేశారు..? ధారావి ప్రాంతాన్ని హరిదాదా తన అధికారంతో దక్కించుకున్నాడా..? అనేదే మిగిలిన సినిమా.
విశ్లేషణ:
ముంబైలో ధారావి అనే ప్రాంతంలో తమిళనాడు నుండి వలస వచ్చిన ప్రజలు బ్రతుకుతుంటారు. మురికివాడలో పని చేసుకునే వారికి నాయకుడిగా ఎదుగుతాడు కరికాలుడు. ఆ ప్రాంతాన్ని దక్కించుకోవాలని చూసే ఓ అధికారి నుండి కాలా ధారావి ప్రజలను ఎలా కాపాడాడనే కాన్సెప్ట్తో ఈ సినిమాను తెరకెక్కించాడు. రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ని సహజత్వానికి దగ్గరగా ఉండే ఒక కథలో చూపించడంమనే ఆలోచన వచ్చినందుకు దర్శకుడు రంజిత్ను మెచ్చుకోవాల్సిందే. కానీ
అతడు రాసుకున్న బలమైన పాయింట్ను తెరపై అందరికీ కనెక్ట్ అయ్యేలా ఆవిష్కరించడంలో ఇంకాస్త శ్రద్ద పెట్టాల్సిందే. రజినీకాంత్ పాత్రని డిజైన్ చేసిన తీరు తెరపై చూపించిన విధానం బాగుంది కానీ కథనంలో తప్పులు దొర్లడంతో ఆడియన్స్కు పెద్దగా కనెక్ట్ అవ్వలేరు.
ధారావి లాంటి ప్రాంతాన్ని కాపాడే పాత్రలో సూపర్ స్టార్ను బాగానే చూపించారు. తెరపై రజినీకాంత్ లాంటి స్టార్ హీరో కనిపిస్తున్నా కథ పరంగా ప్రేక్షకులపై ఎలాంటి ఇంపాక్ట్ కలిగించలేకపోయారు. బలమైన పాయింట్ను తన బలహీనమైన సన్నివేశాలతో దర్శకుడు నీరుగార్చేశాడు. ఫస్ట్ హాఫ్లో ఫ్యామిలీ సీన్స్ ఎక్కువయ్యాయి. పైగా కాలా పాత్రకు లవ్ ట్రాక్ పెట్టడం రుచించదు. ఈ వయసులో ఆయన తన ప్రేమ గురించి ఆలోచించే సన్నివేశాలు కామెడీగా అనిపిస్తాయి. నిజానికి సినిమాకు ఆ ట్రాక్ అవసరం లేదు. ఇక అసలైన కథ ఇంటర్వెల్ ముందు మొదలవుతుంది. నానా పటేకర్ పాత్ర ఎప్పుడైతే తెరపై ఎంట్రీ ఇస్తుందో కథపై ఆసక్తి పెరుగుతుంది. ముందంతా, అతడి పాత్రను చాలా శక్తివంతంగా చూపించి పతాక సన్నివేశాల్లో మాత్రం చాలా పేలవంగా చూపించారు. సెకండ్ హాఫ్ బలమైన సన్నివేశాలు ఉన్నప్పటికీ సాగదీసి చూపించారు. దీంతో సినిమాపై ఆసక్తి సన్నగిల్లుతుంది. చివరకు కథకు ఓ కంక్లూజన్ లేకపోవడం బాధాకరం. రజినీకాంత్ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. అతడిపై చిత్రీకరించిన ఎలివేషన్ షాట్స్ సినిమాకు హైలైట్గా నిలిచాయి. పరిచయ సన్నివేశాలు, ఇంటర్వెల్ బ్లాగ్, పతాక సన్నివేశాల్లో రజినీకాంత్ను బాగా చూపించారు. వర్షంలో డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ బాగుంది. ‘క్యారే సెట్టింగా’ అనే డైలాగ్ ట్రైలర్లో చూసి ఆ సీన్ సినిమాకు ఆకర్షణగా నిలుస్తుందనుకున్నారు కానీ ఆ సీన్లో రజినీకాంత్ ఫైట్ చేయకపోవడం అభిమానులను నిరాశ పరుస్తుంది.
విలన్ పాత్రలో నానా పటేకర్ పక్కా యాప్ట్. అతడి డబ్బింగ్ కూడా బాగుంది. ఇక హీరో, విలన్ మధ్య వచ్చే కాంబినేషన్ సీన్లు అభిమానులతో ఈలలు వేయిస్తాయి. రజినీకాంత్ భార్య పాత్రలో ఈశ్వరీరావు నటన బాగుంది. రజినీకాంత్ ను ‘మావ మావ’ అంటూ పిలుస్తూ తెరపై ఆమె చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. హుమా ఖురేషి తెరపై అందంగా కనిపించింది. నటన పరంగా కూడా మెప్పిస్తుంది. అంజలి పాటిల్ పాత్రను బాగా రాసుకున్నారు. ధారవిలో ధైర్యవంతురాలైన అమ్మాయిగా బాగా నటించింది. సముద్రఖని పాత్ర దాదాపు సినిమా మొత్తం ఉంటుంది. ఆ పాత్ర ఆడియన్స్కు కొత్తగా అనిపిస్తుంది. ఆ రోల్లో సముద్రఖని అక్కడక్కడా నవ్విస్తాడు కూడా.. ఏరియల్ షాట్స్తో సినిమాటోగ్రాఫర్ ఆకట్టుకున్నాడు. సాంకేతిక పరంగా సినిమాటోగ్రాఫర్ ఒక్కడే మెప్పిస్తాడు. సంతోష్ నారాయణ్ థీమ్ మ్యూజిక్ మినహా మరేమీ ఆకట్టుకోదు. ఎడిటింగ్ వర్క్పై ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సివుంది. వాస్తవికమైన పాత్రలో సూపర్స్టార్ని చూపించాలనే దర్శకుడి తపన అర్థమవుతుంది కానీ అతని చాకచక్యం, సమయస్ఫూర్తి, నేర్పు చూపించే సన్నివేశాలు సినిమాలో పెద్దగా కనిపించలేదు. సినిమా మొత్తం ఒకే ప్రాంతంలో చిత్రీకరించారు. కాబట్టి కొత్త లొకేషన్స్ చూసే ఛాన్స్ కూడా ఉండదు. అతి తక్కువ బడ్జెట్లో సింపుల్గా ఈ సినిమాను చిత్రీకరించేశారు. ఓవరాల్గా రజినీ ఫ్యాన్స్కి ‘కాలా’ మాస్ మసాలా ఎంటర్టైనర్. ఆయన స్టైల్, డైలాగ్స్, ఫైట్స్ని అభిమానులు బాగా ఎంజాయ్ చేస్తారు. తమిళ వాసనలు ఎక్కువగా ఉండటంతో తెలుగు ప్రేక్షకుల్ని ‘కాలా’ పెద్దగా మెప్పించకపోవచ్చు.

Related Articles

Leave A Reply

Your email address will not be published.